Bengal Train Accident | న్యూ జల్పాయ్గురి/కోల్‌కతా/న్యూఢిల్లీ, జూన్ 17: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించగా, 41 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య 15 వరకు ఉన్నదని కొన్ని స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు తెలిపాయి. త్రిపురలోని అగర్తలా నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలును న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన ఒక గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై ఆగివున్న ఎక్స్ గూడ్స్ రైలు ఢీకొట్టిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ లోపం కారణమని తెలుస్తున్నది.
గాల్లోకి లేచిన ఎక్స్‌ప్రెస్ బోగీ
తాజా ప్రమాదంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఎక్స్‌ప్రెస్ వెనుక నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ కిందకు గూడ్స్ రైలు ఇంజిన్ దూసుకుపోవడంతో అది గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నది. మృతుల్లో గూడ్స్ రైలు లోకోపైలట్, సహ లోకో పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డ్ కూడా ఉన్నారని రైల్వే శాఖ అధికారి తెలిపారు.
అనాథగా రైల్వే శాఖ: సీఎం మమత
రైలు ప్రమాదం గురించి తెలుసుకొని షాక్‌కు గురయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రైల్వేకు మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ, మునుపటి వైభవం లేదన్నారు. సుందరీకరణపైనే దృష్టి పెట్టిన కేంద్రం.. ప్రయాణికుల సదుపాయాలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. చార్జీల ధరల పెంపుపైనే ఆసక్తి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిగ్నల్ లోపమే కారణమా?
ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్, ఛట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయడం లేదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ 8.27 గంటలకు రంగపాని స్టేషన్ నుంచి బయలుదేరిందని, రాణిపత్ర రైల్వే స్టేషన్, ఛట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆగిందని రైల్వే అధికారి చెప్పారు. సిగ్నల్ వ్యవస్థ విఫలమైన క్రమంలో రాణిపత్ర స్టేషన్ మాస్టర్ కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు టీఏ 912 అథారిటీ జారీచేశారని, ఇది సెక్షన్‌లోని రెడ్ అన్ని సిగ్నల్స్‌ను దాటేందుకు రైలు పైలట్‌కు అనుమతి ఇస్తుందని మరో అధికారి ఒకరు చెప్పారు.
అయితే అదే సమయంలో రంగపాని నుంచి 8.42 గంటలకు బయలుదేరిన గూడ్స్ రైలు కాంచన్జంగను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని వివరించారు. గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్‌ను ఉల్లంఘించడంతో ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా పేర్కొన్నారు. గూడ్స్ డ్రైవర్ సిగ్నల్‌ను ఉల్లంఘించాడన్న రైల్వే బోర్డు చైర్పర్సన్ ప్రకటనను లోకోపైలట్ సంఘం ఖండించింది.
ప్రమాద రూట్లో లేని కవచ్!
ప్రమాదం జరిగిన గువాహటి-ఢిల్లీ మార్గంలో యాంటీ ట్రైన్ కొల్లిజన్(కవచ్) వ్యవస్థ లేదని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. ఆ మార్గంలో కవచ్ ఏర్పాటు ప్రణాళికలో ఉన్నదని చెప్పారు. కవచ్ అమలును యుద్ధప్రాతిపదికన చేపట్టామని, ఇప్పటికే 1500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లపై ఇది పనిచేస్తుందని, మరో 3 వేల కిలోమీటర్ల మేర ఈ ఏడాది ఆఖరుకు ఏర్పాటు చేయనున్నామని ఆమె పేర్కొన్నారు.