PM Modi | జంగిల్ రాజ్ నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లోని తాహేర్పూర్కు వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు. కొంతసేపు హెలిప్యాడ్‌పై చక్కర్లు కొట్టి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ప్రధాని విమానాశ్రయం నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బంకిం చంద్ర ఛటర్జీకి నివాళులర్పించారు. వందేమాతరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మంత్రమని, వందేమాతరాన్ని దేశ నిర్మాణానికి మంత్రంగా మార్చాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులతో భుజం భుజం కలిపి నడుస్తోందని తెలిపారు. జీఎస్టీ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా ప్రజలకు గొప్ప ఉపశమనం ఇచ్చిందని, దుర్గాపూజ, ఇతర పండుగల సమయంలో దేశవ్యాప్తంగా ప్రజల చాలా ప్రయోజనం పొందారన్నారు. బెంగాల్లో చొరబాటుదారులకు టీఎంసీ నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. గంగానది బీహార్ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుందని, బీహార్ బెంగాల్‌కు మార్గం చూపిందని పేర్కొన్నారు. బెంగాల్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. తాను బెంగాల్ ప్రజలకు మనస్ఫూర్తిగా అంకితమయ్యానని, రాష్ట్రానికి నిధుల కొరత లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన.. బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే టీఎంసీ వ్యతిరేకించవచ్చని, రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవడం అర్థరహితమన్నారు.
బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.3200 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. నదియా జిల్లాలోని జాతీయ రహదారి-34లోని బర్జగులి-కృష్ణానగర్ సెక్షన్‌కు చెందిన 66.7 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారిని ప్రారంభించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్-బర్జగులి సెక్షన్‌కు చెందిన 17.6 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేశారు.