కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయస్థానంపై విమర్శలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయమైన స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) రిక్రూట్‌మెంట్‌తోపాటు పలు కేసులపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం హల్దియాలో జరిగిన బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. ‘న్యాయవ్యవస్థలోని ఒకరిద్దరు వ్యక్తులు చేతులు కలుపుతూ, మౌనంగా అవగాహన కలిగి ఉన్నారు. ప్రతి కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. న్యాయవ్యవస్థలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే’ అని అన్నారు.
మరోవైపు అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలను గవర్నర్ జగదీప్ తప్పుపట్టారు. ఆయన మాటలు న్యాయవ్యవస్థను విమర్శించేలా, అనుమానించేలా ఉన్నాయని అన్నారు. దీనిపై అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరి కృష్ణ ద్వివేది, పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయనపై తీసుకున్న చర్యలపై జూన్ 6లోగా తనకు నివేదిక పంపాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తాను నిజాలే మాట్లాడానని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని అభిషేక్ బెనర్జీ అన్నారు.