CM Mamata Banerjee | కోల్‌కతా, ఆగస్టు 28 : ‘బెంగాల్ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తాజా ఘటనలను ఉద్దేశించి బుధవారం కోల్‌కతాలో తృణమూల్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మమత వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ‘దీదీ, అస్సాంను బెదిరించేందుకు ఎంత ధైర్యం? మాపై కళ్లు ఎర్రవి చేసి చూడకండి. మీ విఫల రాజకీయాలతో దేశాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించకండి’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి మమతా బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజందార్ లేఖ రాశారు. ‘నేను ఎప్పుడూ ప్రతీకారాన్ని కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఏది అవసరమైతే అది చేయండి’ అని అమిత్ షాను కోరారు.
అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. వచ్చే వారమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని, దీనిని గవర్నర్ ఆమోదించకపోతే రాజ్‌భవన్ ముందు తానే ధర్నాకు దిగుతానని తెలిపారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని ఆమె కోరారు. హత్యాచార ఘటనలో సీబీఐ విచారణ చేపట్టి 16 రోజులు గడుస్తున్నప్పటికీ న్యాయం ఎక్కడ జరిగిందని ఆమె ప్రశ్నించారు.
విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బెంగాల్ బంద్ బుధవారం ఉద్రిక్తతలతో ముగిసింది. దుకాణాలు, రోడ్లను మూసేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలు రైల్వే స్టేషన్లలో బీజేపీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. అక్కడక్కడ బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ ఎంపీ సామిక్ భట్టాచార్య తదితర బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బుధవారం సస్పెండ్ చేసింది. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఘోష్ ఐఎంఏ కోల్‌కతా శాఖ ఉపాధ్యక్షుడు కూడా. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోకన్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ హత్యాచారం, అనంతర పరిణామాలను తనంతట తాను పరిశీలించిందని ఘోష్‌కు పంపిన ఐఎంఏ ఆర్డర్ పేర్కొంది. కొన్ని వైద్యుల సంఘాలు కూడా ఘోష్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్లు పేర్కొంది. దీంతో ఐఎంఏ క్రమశిక్షణ సంఘం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.