కోల్కతా: న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బీజేపీ ప్రజాప్రతిధులు, నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంపీలు నిషికాంత్ దూబే, రాజ్యసభ సభ్యుడు దినేష్ శర్మ వ్యాఖ్యలు మర్చిపోకముందే వారితో మరో నేత వారితో గొంతు కలిపారు. పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) వారి వ్యాఖ్యలను సమర్ధించారు. చట్టసభలకు సంబంధించి సీజేఐ పాత్రను ప్రశ్నించారు. దూబే చెప్పిందే సరైనదే. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాంటప్పుడు రాష్ట్రపతి ఆదేశాన్ని సీజేఐ ఎలా తిరస్కరించగలరని ప్రశ్నించారు. దేశంలోని ఎంపీలు, విధాన రూపకర్తల నిర్ణయాన్ని ఆయన ఎలా కాదనగలదరని నిలదీశారు. దేశాన్ని సీజేఐ, సుప్రీంకోర్టు నడిపుతుంటే ఇక పార్లమెంటుతో అసరమం ఏముందన్నారు. అప్పుడు ప్రతీదీ సీజేఐ చేయాలని వెల్లడించారు.
కాగా, బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కాలపరిమితి విధించడాన్ని ఎంపీ నిషికాంత్ దూబే తప్పు పట్టిన విషయం తెలిసిందే. దేశంలో మత యుద్ధాలను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టే కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఈ దేశంలో జరుగుతున్న అన్ని అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలన్నారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మించి పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి దానికీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మూసివేయాలన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. నియామక అధికారికి సుప్రీంకోర్టు ఎలా దిశానిర్దేశం చేస్తుందని ప్రశ్నించారు? ఈ దేశానికి పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తుంది. పార్లమెంటును సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఉంది?. సుప్రీంకోర్టు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు.
మరో బీజేపీ ఎంపీ దినేష్ శర్మ కూడా శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యంపై సైతం స్పందించారు. రాజ్యంగంలో శాసనసభ, న్యాయవ్యవస్థ హక్కులు స్పష్టంగా రాసిఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ, రాజ్యసభను ఎవరూ నిర్దేశించలేరు. రాష్ట్రపతి ఇప్పటికే వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతిని ఎవరూ సవాలు చేయలేరు, ఎందుకంటే ఈ దేశానికి రాష్ట్రపతి సుప్రీం అని వ్యాఖ్యానించారు.
అయితే న్యాయవ్యవస్థపై, దేశ ప్రధాన న్యాయమూర్తిపై ఇరువురు ఎంపీలు చేసిన ప్రకటనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అవి వారి వ్యక్తిగత ప్రకటనలని చెప్పారు. బీజేపీ అలాంటి ప్రకటనలతో ఏకీభవించదని, ఎప్పుడూ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. బీజేపీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుందని తెలిపారు. పార్టీ ఎంపీలెవరూ న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించారు. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ ఎక్కడ మాట్లాడవద్దని నడ్డా సూచించారు.