చండీగఢ్, జనవరి 24: ఆఫీసులో తక్కువ పని ఉంటే ఆ కిక్కే వేరని చాలా మంది అనుకొంటారు. అయితే ఇదే సమయంలో కొంత మంది పనిరాక్షసులు కూడా ఉంటారు. తక్కువ పని లేదా ఊరికే కూర్చోవడం వలన వారికి ఏమీ పాలుపోదు. ఈ కోవలోకే వస్తారు హర్యానా క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. ఈ నెల 9న అదనపు ప్రధాన కార్యదర్శి(పురాతన పత్రాల భాండాగార విభాగం)గా ఆయన బదిలీ అయ్యారు. ఇక్కడ తనకు రోజుకు 8 నిమిషాల పని మాత్రమే ఉంటుందని, ఏడాదికి రూ.40 లక్షల వేతనం తీసుకొంటున్నానని.. తనకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం చీఫ్ పోస్టు ఇవ్వాలని కోరుతూ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు లేఖ రాశారు. కొంతమంది ఇతర అధికారులపై పలు విభాగాల్లో అదనపు పనిభారం పడుతున్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన 30 ఏండ్ల సర్వీసులో ఇటీవలే ఆయన 56వ సారి బదిలీ అయ్యారు.