సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): శివార్లలోని మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లో అక్రమ మద్యం రవాణా జోరందుకుం ది. ఢిలీ, నోయిడా, గుర్గావ్, తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద ఎత్తున అక్రమ మద్యం రవాణా జరుగుతోంది. ఈ మేరకు పక్కా సమాచా రం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకుని, రూ.2.50లక్షల విలువచేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు కథనం ప్రకారం…ఉప్పల్ ప్రాంతానికి చెందిన గోపాల్‌రెడ్డి గతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి మద్యం ధరలకు నగరంలోని మద్యం ధరలకు చాలా వ్యత్యాసాన్ని గమనించాడు.
నగరంలో లభించే ఖరీదైన మద్యం బాటిల్ కంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లభించే అదే బ్రాండ్ మద్యం బాటిల్‌పై కనీసం రూ.1500నుంచి రూ.2000వరకు తక్కువ ధర ఉండడాన్ని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, తదితర ప్రాంతాల నుం చి పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమంగా నగరానికి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ నుంచి అక్రమంగా కారులో మద్యం తీసుకువస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసు బృందం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో కారును ఆపి, తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బయటపడింది. దీంతో కారు డ్రైవర్ ఆదిత్య ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్‌లో నివాసం ఉండే గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి తీసుకురమ్మన్నాడని, ఢిల్లీలోని మద్యం దుకాణంలో డబ్బులు కూడా అతనే చెల్లించాడని వెల్లడించాడు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు గోపాల్‌రెడ్డి ఇంటిపై దాడు లు జరిపి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ ప్రాంతానికి రెండు మార్లు 30 కాటన్ల చొప్పున నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ను సరఫరా చేసినట్లు నిందితులు ఎస్టీఎఫ్ పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.2.50లక్షల విలువ చేసే 84స్కాచ్ బాటిళ్లతో పాటు కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో అక్రమంగా మద్యం విక్రయించిన ప్రసాద్ అనే వ్యక్తితో పాటు డిస్ట్రిబ్యూటర్ సహా మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.