Day Care Centre | ఓ పని మనిషి క్రూర మృగంలా ప్రవర్తించింది. ఓ పసిబిడ్డను నేలకేసి కొట్టింది. అంతేకాదు బ్యాట్‌తో చితకబాదింది. తలను గోడకేసి కొట్టింది. ఈ దారుణ ఘటన నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు కావడంతో.. తమ 15 నెలల పసిబిడ్డను స్థానికంగా ఉన్న ఓ డే కేర్ సెంటర్లో జాయిన్ చేశారు. అయితే ఆగస్టు 4వ తేదీన ఆ ఆడశిశువు ఎందుకో గుక్కపట్టి ఏడ్చింది. దీంతో డే కేర్‌లో పని చేసే పని మనిషి.. పాపను లాలించాల్సి పోయి.. క్రూర మృగంలా ప్రవర్తించింది.
ఏడుస్తున్న ఆ పసిబిడ్డను ఎత్తుకుని పలుమార్లు నేలకేసి కొట్టింది. అయినా ఏడుపు మానడం లేదని తలను గోడకేసి కొట్టింది. చెంప దెబ్బలతో తీవ్రంగా గాయపరిచింది. బ్యాట్‌తో కొట్టడంతో తొడలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక తమ బిడ్డను సాయంత్రం ఇంటికి తీసుకెళ్లిన పేరెంట్స్.. ఆ పసిపాప శరీరంపై ఉన్న గాయాలను షాక్ అయ్యారు. వైద్యుని సంప్రదించారు. ఈ గాయాలన్నీ ఎవరో కొట్టినవే అని డాక్టర్ నిర్ధారించారు.
దీంతో డే కేర్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీని బాధిత చిన్నారి పేరెంట్స్ పరిశీలించారు. చంటిబిడ్డను పనిమనిషి హింసించిన భయానక దృశ్యాలను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో డే కేర్ సెంటర్ హెడ్‌తో పాటు పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.