ఇప్పటి యుగమంతా భజరపరుల యుగమేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. ఇంతటి భజనపరులు, చెంచాల యుగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్‌ను, కలలను ముందుకు తీసుకెళ్లడం కష్టమైన పనేనని అన్నారు. అయినా… తాము అంబేద్కర్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తూనే వుంటామని ఆమె స్పష్టం చేశారు. బీఎస్పీ సిద్ధాంతకర్త, వ్యవస్థాపకులు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ ఉద్యమం చేస్తోందని, వీరందరూ వారి వారి కాళ్ల మీద నిలబడే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతూనే వుంటుందన్నారు. ఇప్పుడు అంతా చెంచాల యుగమే. ఈ యుగంలో అంబేద్కర్ మిషన్‌కు కట్టుబడి ఉండటం కష్టమే. బహుజన ఉద్యమం కారణంగానే బీఎస్పీ యూపీలో ఘన విజయం సాధించింది. ఇకపై కూడా ఇలాగే పోరాటాలు చేస్తాం. మా సిద్ధాంత పునాదులపైనే పోరాటం చేస్తాం. ఇదే కాన్సీరాంకు ఇచ్చే నిజమైన నివాళి అని మాయావతి పేర్కొన్నారు.