శ్రీనగర్: యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.1.26 కోట్లకు పైగా బ్యాంకు అధికారి విత్ డ్రా చేశాడు. మూడేళ్లుగా ఈ మోసానికి పాల్పడుతున్న అతడి వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది. (Banker Withdraws Rs.1.26 Crores) జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈశ్విందర్ సింగ్ రన్యాల్ జమ్ముకశ్మీర్ బ్యాంక్‌కు చెందిన పౌనీ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గత మూడేళ్లుగా డోర్మంట్ ఖాతాల నుంచి రూ.126.34 లక్షలు విత్ డ్రా చేశాడు. యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసి ఆ ఖాతాల్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేస్తున్నాడు.
కాగా, ఈశ్విందర్ సింగ్ గత నెలలో ఒక యాక్టివ్ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేశాడు. ఆ బ్యాంకు ఖాతా వినియోగదారుడు దీనిని గుర్తించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసం తీవ్రతపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పౌనీలో నివాసం ఉంటున్న నిందితుడు ఈశ్విందర్ సింగ్ రన్యాల్ను శనివారం అరెస్ట్ చేశారు. ఈ మోసం గురించి మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.