ముంబై : రుణం రికవరీ కోసం బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) ఇంటిని బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం వేయనుంది. బ్యాంకుకు సన్నీడియోల్ రూ. 56 కోట్లు బకాయి పడటంతో ఈ మొత్తం వసూలు చేసుకునేందుకు ముంబైలోని జుహులో నటుడి లగ్జరీ విల్లాను బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం వేయనుంది. రుణ మొత్తం రూ. 56 కోట్లు కాగా, దీనిపై వడ్డీని కూడా బ్యాంక్ రికవరీ చేయనుంది.
వేలం నోటీసును పత్రికాముఖంగా బ్యాంకు జారీ చేసింది. సన్నీ విల్లా పేరుతో నటుడి అసలు పేరు అజయ్ సింగ్ డియోల్ పేరిట జారీ చేసిన ఈ నోటీసులో పలు వివరాలు పొందుపరిచారు. సన్నీ డియోల్ సోదరుడు బాబీ డియోల్ అసలు పేరు విజయ్ సింగ్ డియోల్, వారి తండ్రి ధర్మేంద్ర సింగ్ డియోల్, సన్నీ డియోల్ కంపెనీ సన్నీ సౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రుణానికి హామీదార్లుగా, కార్పొరేట్ హామీదారుగా ఉన్నారు. జుహులోని గాంధీగ్రాం రోడ్డులోని సన్నీ విల్లా పేరుతో ఉన్న విల్లాను వేలం వేయనున్నారు.
ఈ విల్లా వేలానికి బ్యాంకు రూ. 51.43 కోట్లను రిజర్వ్ ప్రైస్‌గా నిర్ధారించింది. ఈ అంశాన్ని పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే వివాదం సమసిపోతుందని సన్నీ డియోల్ ప్రతినిధి స్పందించారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని సన్నీ డియోల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Read More :
Jailer Movie | పది రోజుల్లో రూ.500 కోట్లు.. రజనీ ఊరమాస్..!