సినీ ఫక్కీలో మాస్కులు ధరించిన కొందరు దుండగులు ఆ బ్యాంకులో చొరబడ్డారు. తుపాకులతో అక్కడి ఉద్యోగులను బెదిరించి, వాళ్లందర్నీ బాత్రూంలో బంధించారు. ఆ తర్వాత లాకర్ తెరిచి అందులో సుమారు 32 కేజీల బంగారంతో ఉడాయించారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది. ఆరంబాక్కం ప్రాంతంలోని ఫెడ్బ్యాంకులో ముగ్గురు దొంగలు ఈ దొంగతనం చేశారు. దొంగల్లో ఒకరు బ్యాంకు ఉద్యోగేనని పోలీసులు తెలిపారు.
బ్యాంకు సెక్యూరిటీ గార్డుకు ముందుగా ఒక కూల్ డ్రింక్ ఇచ్చారా దొంగలు. తమలో ఒకడే ఇవ్వడంతో ఆ గార్డు దాన్ని తాగేశాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత సెక్యూరిటీ గార్డు స్పృహ తప్పాడు. ఆ తర్వాత దొంగలు తమ ప్లాన్ అమలు చేశారు. ఉద్యోగులు అందర్నీ బాత్రూంలో బంధించి బంగారం దోచుకెళ్లారు. బంగారం ఆడిట్ నిర్వహించిన తర్వాత ఎంత మొత్తం పోయిందీ స్పష్టంగా తెలుస్తుందని, ప్రస్తుతానికైతే రూ.20 కోట్ల విలువైన బంగారం పోయినట్లు అంచనా వేస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు.