డిప్యూటీ మేనేజర్‌పై 10-12 కత్తిపోట్లు.. హత్య
క్యాషియర్పైనా తీవ్ర దాడి.. బాధితులిద్దరూ మహిళలే
ఓ బ్యాంకు మాజీ మేనేజర్ ఘాతుకం
ముంబై, జూలై 31: తాను మేనేజర్‌గా పనిచేసిన బ్యాంకులోనే దొంగతనానికి యత్నించాడు. అడ్డుకొన్న డిప్యూటీ మేనేజర్‌ను అత్యంత కిరాతకంగా కత్తితో 10-12 సార్లు పొడిచి చంపాడు. క్యాషియర్‌ను తీవ్రంగా గాయపర్చాడు. బ్యాంకు లాకర్లో ఉన్న 3.38 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను దోచుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు.
మహారాష్ట్రలోని వీరార్(తూర్పు) ఐసీఐసీఐ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. బాధితులిద్దరూ మహిళలే. నిందితుడి పేరు అనిల్ దూబే(35). వీరార్ ఐసీఐసీఐ బ్యాంకులో 15 నెలలు మేనేజర్‌గా పనిచేశాడు. సాయంత్రం 7.30 గంటల తర్వాత బ్యాంకులో సిబ్బంది ఉండరని, డే సెక్యూరిటీ గార్డు 7 గంటలకే వెళ్లిపోతే, నైట్ గార్డు 9 గంటలకు వస్తాడని తెలుసుకొన్నాడు. గురువారం రాత్రి 8 గంటలకు బ్యాంకులోకి ప్రవేశించాడు. డిప్యూటీ మేనేజర్ యోగితను చంపేశాడు.
శ్రద్ధ మెడపై కత్తితో పొడిచాడు. ప్రతిఘటించడంతో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆమె ధైర్యంగా అలారం మోగించి అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దూబేను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనిల్ దూబే ప్రస్తుతం మరో చోట ఆక్సిస్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దూబేకు అప్పులు అయ్యాయని, వాటిని తీర్చడానికే దొంగతనానికి యత్నించాడని పోలీసులు తెలిపారు.