న్యూఢిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి ఐదు ప్రాంతాల్లో కంచె నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్టు బంగాదేశ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి ఆ శాఖ కార్యదర్శి జషీమ్ ఉద్దీన్ను కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ సమన్లు జారీ చేసిన విషయం నిజమేనని అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం 150వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కారాదని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు అనవసరమైన విదేశీ ప్రయాణాలపై పరిమితులు విధించుకోవడమే భారత్ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కారణమని బంగ్లాదేశ్ పేర్కొన్నది.