HomeNationalBangladesh Seven Mans Arrested India Border Cross
ఏడుగురు బంగ్లాదేశీ చొరబాటుదారుల అరెస్టు
పశ్చిమ బెంగాల్‌లోని నాదియా, ముర్షిదాబాద్ జిల్లాలలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన భారీ ఆపరేషన్‌లో ఏడుగురు బంగ్లాదేశీ చొరబాటుదారులు, ముగ్గురు భారతీయ దళారులను బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం నిర్బంధించారు.
కోల్‌కతా, ఫిబ్రవరి 7: పశ్చిమ బెంగాల్‌లోని నాదియా, ముర్షిదాబాద్ జిల్లాలలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన భారీ ఆపరేషన్‌లో ఏడుగురు బంగ్లాదేశీ చొరబాటుదారులు, ముగ్గురు భారతీయ దళారులను బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం నిర్బంధించారు. ఫిబ్రవరి 6 తెల్లవారుజామున 5 గంటలకు బీఎస్ఎఫ్ ఆపరేషన్ ప్రారంభమైంది.
సరిహద్దుల మీదుగా భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు చొరబాటుదారులను గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వారిలో ఇద్దరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న ఐదుగురు బంగ్లాదేశీయులు వెనుదిరిగి భారత్ సరిహద్దుల్లోకి పరుగులు తీశారు.
వారి కోసం వేట ప్రారంభించిన బీఎస్ఎఫ్ జవాన్లు నిఘా వర్గాల సమాచారంతో అక్రమ సరిహద్దు చొరబాట్లకు సహకరిస్తున్న ముగ్గురు భారతీయ దళారులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు గోపాల్పూర్ సమీపంలో ఓ అరటి తోటలో దాక్కుని ఉన్న ఐదుగురు బంగ్లాదేశీయులను నిర్బంధించారు. అక్రమ చొరబాట్ల కోసం దళారులు ఒక్కో వ్యక్తి నుంచి రూ. 7,000 వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.