Chinmay Das | హిందూ సంస్థ సమ్మిళిత్ సనాతనీ జోట్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌ను బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది. అతన్ని జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసిస్తూ గతంలో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుపై చర్యలు తీసుకున్నారు. దేశద్రోహం, మత సామరస్యానికి భంగం కలిగించారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు హిందూ సంఘాలు ఢాకా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ అంశంపై భారత్ స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చిన్మయ్ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
హిందువులతో పాటు మైనారిటీలందరికీ శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా భద్రత కల్పించాలని అధికారులకు సూచించింది. అక్టోబర్ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించారన్న కారణంతో చిన్మయ్ దాస్ ప్రభుతో సహా 19 మందిపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ సైతం చేశారు. సనాతన్ జాగరణ్ మంచ్ ఎనిమిది అంశాల డిమాండ్లతో చిట్టగాంగ్‌లోని లాల్దిఘి మైదానంలో ర్యాలీ నిర్వహించింది. చౌరస్తాలో ఉన్న ఆజాదీ స్తంభంపై కొందరు వ్యక్తులు కాషాయ జెండాలను ఎగుర వేశారు. జాతీయ జెండాను అవమానించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గత ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా విద్యార్థి ఆందోళనలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. హసీనా సర్కారు పతనం అనంతరం.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక సర్కారు కొలువుదీరింది. ఆ తర్వాత హిందువులు, ఇతర మైనారిటీ ప్రజలపై దాడులు జరిగాయి. దీనికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అక్టోబర్ నుంచి సనాతన్ జాగరణ్ మంచ్ చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నది. ఇందులో చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుత్వ పాల్గొని.. తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మైనారిటీల తరఫున తాత్కాలిక ప్రభుత్వం ఎదుట ఎనిమిది డిమాండ్లను పెట్టారు. మైనారిటీలపై దాడులకు తెగబడే వారిని విచారించేందుకు తాత్కాలిక ట్రైబ్యునల్ ఏర్పాటు, బాధితులకు పరిహారం, పునరావాసం, మైనారిటీ రక్షణ చట్టం అమలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు.