న్యూఢిల్లీ, జనవరి 13: ఉభయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషనర్‌ను కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం పిలిపించింది. కాగా, 4,156 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐదు ముఖ్యమైన ప్రదేశాలలో కంచె నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తున్నట్టు బంగ్లాదేశ్ ఇటీవల ఆరోపించింది.
ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం పిలిపించి చర్చలు జరిపింది. చారిత్రకంగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు సుస్థిరంగా ఉన్నప్పటికీ విద్యార్థుల నిరసనల వల్ల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయాన్ని పొందిన నాటి నుంచి ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.