పాట్నా: మహా శివరాత్రిని పురస్కరించుకుని భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శకటాలను ప్రదర్శించారు. అయితే బజరంగ్ దళ్ ఏర్పాటు చేసిన ‘లవ్ జిహాద్’ శకటంపై రాజకీయ దుమారం చెలరేగింది. (‘love jihad’ tableau) ఎన్డీయే పాలిత రాష్ట్రమైన బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముంగేర్‌లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. మంకేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 50కు పైగా శకటాలను ప్రదర్శించారు.
కాగా, ఈ ఊరేగింపు సందర్భంగా ‘లవ్ జిహాద్’ పేరుతో ఒక శకటాన్ని బజరంగ్ దళ్ ప్రదర్శించింది. హిందూ యువతులపై ముస్లిం వ్యక్తుల దురాగతాలను చిత్రీకరించే బొమ్మలు, ఫ్రిజ్‌లో యువతి మృతదేహం ముక్కలు. హిందూ మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన వార్తాపత్రికల కటింగ్‌లు వంటివి ఆ శకటంపై ఉంచారు. ‘మీరు మీ మతాన్ని వీడితే.. ముక్కలవుతారు’ అన్న ఫ్లకార్డులను కూడా ప్రదర్శించారు.
మరోవైపు బజరంగ్ దళ్ ప్రదర్శించిన ‘లవ్ జిహాద్’ శకటంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. మత సామరస్యాన్ని కాపాడటంలో అధికార జేడీ(యూ) విఫలమైందని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ ఆరోపించారు. ‘వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అల్లర్లను రెచ్చగొట్టడానికి కుట్ర జరుగుతోంది. శివరాత్రి రోజున ‘లవ్ జిహాద్’ థీమ్ ఎందుకు ప్రదర్శించారు? బీహార్‌లో హిందూ, ముస్లింల మధ్య సంఘర్షణ లేదని నితీష్ కుమార్ అంటున్నారు. కానీ బజరంగ్ దళ్-బీజేపీ శకటాన్ని జేడీ(యూ) వ్యతిరేకిస్తుందా?’ అని ప్రశ్నించారు.
అయితే అధికార ఎన్డీయే కూటమిలోని పార్టీలు బజరంగ్ దళ్ ‘లవ్ జిహాద్’ శకటం ప్రదర్శనను సమర్థించాయి. ఈ ప్రదర్శనలో చాలా శకటాలున్నాయని, ఈ ఒక్క దానినే ప్రశ్నించడం సరికాదని ఎల్జేపీ (ఆర్) నేత ధీరేంద్ర మున్నా అన్నారు. బీహార్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.