అహ్మదాబాద్ : హిందూ సంస్ధలు, బీజేపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న షారుక్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలకు గుజరాత్లో అడ్డంకులు తొలగిపోయాయి. పఠాన్ మూవీ విడుదలను అడ్డుకోబోమని భజరంగ్ దళ్, వీహెచ్‌పీ ప్రకటించాయి. పఠాన్ మూవీపై కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సూచించిన మార్పుల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని ఈ సంస్ధలు వెల్లడించాయి.
భజరంగ్ దళ్ నిరసనల అనంతరం పఠాన్ మూవీలో అభ్యంతరకర లిరిక్స్, అసభ్యకరమైన పదాలను తొలగించారని వీహెచ్‌పీ గుజరాత్ ప్రతినిధి అశోక్ రావల్ పేర్కొన్నారు. మన మతం, సంస్కృతిని కాపాడే క్రమంలో హిందూ సమాజం చేసిన పోరాటానికి అభినందనలు తెలుపుతున్నానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
పఠాన్ మూవీపై హిందూ సంఘాల నిరసన, సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ నడిచిన అనంతరం సీబీఎఫ్సీ మూవీలోని బేషరం రంగ్ పాటలోని అభ్యంతరకర సీన్స్‌తో పాటు మొత్తం 10 కట్స్ సూచించింది. అయితే ఇదే పాటలో వివాదాస్పదమైన దీపిక ధరించిన కాషాయ దుస్తులు అలాగే ఉన్నాయి. కాగా పఠాన్ మూవీపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రాతో పాటు పలువురు బీజేపీ నేతలు, హిందూ సంస్ధల ప్రతినిధులు విరుచుకుకపడిన సంగతి తెలిసిందే. గుజరాత్, అసోంలో పఠాన్ మూవీ విడుదలయ్యే థియేటర్ల వద్ద మూవీ పోస్టర్లను హిందూ సంస్ధల కార్యకర్తలు చించి వేసి దగ్ధం చేయడం కలకలం రేపింది.