న్యూఢిల్లీ, ఆగస్టు 13: ‘బెయిల్ అనేది నిబంధన.. జైలు అనేది మినహాయింపు’ అనే సూత్రం ఉపా చట్టం కింద నమోదైన కేసులకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొన్నది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్న కేసు వచ్చినప్పుడు బెయిల్ ఇవ్వడానికి కోర్టు వెనకాడకూడదు. ప్రాసిక్యూషన్ ఆరోపణలు తీవ్రమైనవే అయినప్పటికీ చట్ట ప్రకారం బెయిల్ మంజూరు కోసం దాఖలైన కేసును పరిగణనలోకి తీసుకోవడం కోర్టు బాధ్యత. బెయిల్ ఒక నిబంధన.. జైలు మినహాయింపు అనేది నిర్దిష్ట సూత్రం. అర్హత ఉన్న కేసుల్లోనూ కోర్టులు బెయిల్‌ను తిరస్కరించడం ప్రారంభిస్తే, అది రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుంది’ అని పేర్కొన్నది.
ఎన్ఐఏ 2022లో అరెస్టు చేసిన పాట్నాకు చెందిన రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ జలాలుద్దిన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత పీఎఫ్ఐ సభ్యులకు ఇంటిని అద్దెకు ఇచ్చి, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడని ఎన్ఐఏ ఆరోపించింది. అయితే, ఉపా చట్టంలో పేర్కొన్న చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో జలాలుద్దిన్ ఖాన్ పాల్గొన్నట్టు చార్జ్‌షీట్‌లో ఏమీ లేదని కోర్టు పేర్కొన్నది.