బరేలీ, న్యూఢిల్లీ: ‘డబ్బు కోసం నా బిడ్డను కొందరు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చంపేశారు, దయ చేసి నా బిడ్డను బతికించండి’ అంటూ ఒక వ్యక్తి నవజాత శిశువుతో అధికారులందరినీ అభ్యర్థిస్తున్న హృదయ విదారక దృశ్యం యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కన్పించింది. చేతి సంచిలో నవజాత శిశువు మృతదేహంతో కార్యాలయానికి వచ్చిన 30 ఏండ్ల విపిన్ గుప్తా ఒక ప్రైవేట్ దవాఖాన యాజమాన్యం తన భార్య రూబీ గుప్తాకు తప్పుడు చికిత్స అందించడంతో కడుపులోనే బిడ్డ మరణించిందని విలపిస్తూ చెప్పాడు. ‘నా భార్య.. బిడ్డ గురించి అడుగుతోంది. ఆమెకు నేను ఏం సమాధానం చెప్పాలి?’ అంటూ పదేపదే అక్కడున్న అందరినీ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నిండు గర్భవతి అయిన తన భార్య ప్రసవం కోసం విపిన్ గుప్తా గురువారం రాత్రి లఖింపూర్ ఖేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, సాధారణ ప్రసవానికి రూ.10 వేలు, మరో చిన్న ఆపరేషన్ చేయడానికి రూ.12 వేలు అవుతుందని చెప్పారు. దీంతో చికిత్స ప్రారంభించమని చెప్పిన విపిన్, తొలుత రూ.8 వేలు చెల్లించాడు. అయితే మిగిలిన సొమ్ము కడితేనే చికిత్స చేస్తామని హాస్పిటల్ వారు మొండికేశారు. దీంతో విపిన్ తన భార్యను వేరే దవాఖానకు తీసుకువెళతానని కోరినా వారు విన్పించుకోలేదు. మరో పక్క ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నా వారు ఆపరేషన్ను ప్రారంభించ లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను రోడ్డుపై నిలబెట్టిన దవాఖాన సిబ్బంది ఎట్టకేలకు రిఫరల్ లెటర్ ఇవ్వడంతో విపిన్ తన భార్యను మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకువెళ్లాడు.
అయితే అప్పటికే బిడ్డ కడుపులోనే మరణించడంతో ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది. మొదటి దవాఖాన వారు మానవత్వాన్ని మరచి వ్యవహరించారని, తప్పుడు వైద్య చికిత్స అందించారని బాధితుడు ఆరోపించాడు. కాగా, బాధితుడి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ దవాఖానను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించినట్టు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఆ దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులందరినీ జిల్లా దవాఖానకు తరలించామన్నారు.
అధ్యాపకులను గౌరవంగా చూడకపోవడం లేదా వారికి గౌరవనీయమైన వేతనాలు అందచేయకపోవడం వల్ల జ్ఞానానికి ఒక దేశం ఇచ్చే విలువ క్షీణించడంతో పాటు దేశంలో మేధో సంపత్తిని నిర్మించే బాధ్యతను తీసుకున్న వారిలో ప్రేరణను కలుగచేయలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్యక్రమాలలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరహ అని శ్లోకాలు చదివితే సరిపోదని, ఈ ఉపదేశాన్ని మనం నిజంగా విశ్వసిస్తే ఉపాధ్యాయులను దేశం ఎలా గౌరవిస్తోందో అది మన చేతల్లో కనిపించాలని అత్యున్నత న్యాస్థానం వ్యాఖ్యానించింది.
గుజరాత్లోని వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో కాంట్రాక్టు విధానంపై నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇస్తున్న తక్కువ జీతాలపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 30,000 జీతంగా చెల్లించడం పట్ల ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని వారు నిర్వర్తించే విధుల ఆధారంగా వారి జీతాల విధానాన్ని హేతుబద్ధం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విద్యావేత్తలు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఏ దేశానికైనా మేధోపరంగా వెన్నెముకలని, భవిష్యత్తు తరాల మేధస్సును, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి వారు తమ జీవితాన్ని అంకితం చేసుకుంటారని ధర్మాసనం పేర్కొంది.
పాఠ్యాంశాల బోధనకే వారి బాధ్యతలు పరిమితం కావని, విద్యార్థుల పరిశోధనలకు మార్గదర్శిగా ఉండడమేగాక, విమర్శనాత్మక ఆలోచనా విధానానికి ప్రేరణ అందచేసి, విద్యార్థులకు విలువలను నేర్పి సమాజ అభ్యున్నతికి తోడ్పడతారని ధర్మాసనం తెలిపింది. వారి సేవలకు గుర్తింపుగా వారికి లభించే వేతనాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.