Baba Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు (Baba Siddique Murder) గురైన విషయం తెలిసిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఈ కేసులో నలుగురు నిందితుల్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా షూటర్లు (shooters) కీలక విషయాలు వెల్లడించారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న షూటర్లు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్మప్లు ముంబైలోని కుర్లా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న సమయంలో యూట్యూబ్ వీడియోలను (YouTube videos) చూసి తుపాకీలను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఖాళీ స్థలం లేని నిందితులు దాదాపు నాలుగు వారాల పాటూ ఈ వీడియోలను చూస్తూ లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం ఎలాగో నేర్చుకున్నట్లు ఓ అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది. ఈ కేసులో శివకుమార్ గౌతమ్ మెయిన్ షూటర్‌గా ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.
ఇక దర్యాప్తులో నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా ఉపయోగించినట్లు వెల్లడైంది. ఎవరికీ అనుమానం రాకుండా కమ్మూనికేషన్ కోసం స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకున్నట్లు తేలింది. హత్యకు 25 రోజుల ముందు వరుకు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా వేసినట్లు సదరు అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
సిద్ధిఖీ దారుణ హత్య
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండుగులు తుపాకులతో కాల్పులు జరిపారు. గుండెకు తూటా తగలడంతో గాయపడిన సిద్ధిఖీని హూటాహుటిన లీలావతి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. సిద్ధిఖీని చంపేందుకు ఒక్కో నిందితుడికి లారెన్స్ గ్యాంగ్ రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని, అలాగే మారణాయుధాలు సైతం సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీకి 15 రోజుల క్రితమే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
హత్య మేమే చేశాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధిఖీని తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లంకర్ ఫేస్బుక్లో హెచ్చరించాడు. బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెకీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.
Also Read..
Rajiv Kumar | హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు తప్పిన పెను ప్రమాదం
Bomb Threat | మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
DA | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 3 శాతం పెంపు..!