ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ హత్య(Baba Siddique Murder) కేసుకు సంబంధించిన ప్లానింగ్ వివరాలు పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిక్‌ను హత్య చేసేందుకు నిందితులు తమ వద్ద సుమారు 65 బుల్లెట్లు ఉంచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిక్ హత్య కేసులో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ నిందితులుగా ఉన్నారు. సిద్ధిక్‌ను హత్య చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ వేశారు. గన్ ఫైర్ జరిపేందుకు కావాల్సిన బుల్లెట్లను సమకూర్చుకున్నారు. బుల్లెట్ల కొరత రాకూడదన్న ఉద్దేశంతో.. సిద్దిక్ హత్య కోసం నిందితులు 65 బుల్లెట్లు తెచ్చిపెట్టుకున్నారు. యూట్యూబ్‌లో ఆయుధ వినియోగం గురించి ట్రైనింగ్ తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలన్న కోణంలో కూడా శిక్షణ పొందారు. కచ్చితంగా మర్డర్ జరగాలని ప్లాన్ వేశారు.
ఇప్పటి వరకు సిద్దిక్ హత్య కేసులో నలుగుర్ని అరెస్టు చేశారు. హర్యానా నివాసి గుర్మైల్ సింగ్, యూపీ నివాసి ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్, హరీశ్‌కుమార్ బలరామ్ నిషాద్, ప్రవీణ్ లోంకర్.. అరెస్టు అయినవారిలో ఉన్నారు. గుర్మైల్, కశ్యప్లిద్దరూ షూటర్లు. నిషాద్, కశ్యప్‌లు ఒకే ఊరికి చెందిన వాళ్లు. సిద్దిక్‌ను హత్య చేసేందుకు గుర్మైల్, కశ్యప్‌లు తమ వద్ద 65 బుల్లెట్లు పెట్టుకున్నారు. ఏ క్షణం అయినా బుల్లెట్లు కొరత రావద్దు అన్న ఉద్దేశంతో ఎక్కువ సంఖ్యలో ఆయుధ సామాగ్రిని తెచ్చుకున్నారు. అయితే అక్టోబర్ 12వ తేదీన జరిగిన మర్డర్ కేసులో.. ఆరు బుల్లెట్లను ఫైర్ చేశారు.
నిందితుల నుంచి రెండు ఆయుధాలను సీజ్ చేశారు. దాంట్లో ఒకటి ఆస్ట్రియా పిస్తోల్. మరొకటి నాటు తుపాకీ. సింగ్, కశ్యప్ వద్ద 28 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మర్డర్ జరిగిన ప్రదేశం నుంచి ఓ బ్లాక్ బ్యాగ్‌ను గుర్తించారు. దాంట్లో టర్కీ తయారీ 7.62 బోర్ పిస్తోల్ ఉన్నది. దానితో పాటు 30 లైవ్ రౌండ్లకు చెందిన మందుగుండు ఉన్నది. ఆ బ్యాగులో రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. శివకుమార్, సుమిత్ కుమార్ పేరుతో ఉన్నా.. రెండింటిలో శివకుమార్ ఫోటో మాత్రమే ఉన్నది.
నిజానికి బైక్ ద్వారా అటాక్ ప్లాన్ చేశారు నిందితులు. షూట్ చేసిన తర్వాత బైక్‌పై పారిపోవాలని అనుకున్నారు. కానీ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఆ బైక్ ప్లాన్ మార్చేశారు. ఆటోరిక్షా ద్వారా ముగ్గురు నిందితులు క్రైం సీన్ వద్దకు చేరుకున్నారు. హత్య చేసిన తర్వాత ముగ్గురు గుర్తుపట్టకుండా ఉండేందుకు బట్టలు మార్చుకున్నారు. హత్యకు కుట్ర చేసిన నిషాద్ అనే నిందితుడు బైక్ కొనేందుకు 60వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. దీంట్లో 32 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నారు.
సిద్దిక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనేక మంది అనుమానితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన శుభం లోంకర్ దీంట్లో ప్రధాన నిందితుడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను నేపాల్ వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిల్లర్లకు ఆర్థిక సాయం చేసిన శుభం సోదరుడు ప్రవీన్ లోంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గన్ వాడకం గురించి నిందితులు యూట్యూబ్ శిక్షణ పొందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముంబైలోని కుర్లా ఏరియాలో ఓ ఇంటిని కిరాయి తీసుకుని.. లోడింగ్, అన్లోడింగ్, వెపన్ హ్యాండ్లింగ్ శిక్షణ పొందారు. యూపీలో పెళ్లి సంబరాల వేళ జరిగే ఫైరింగ్‌లో శివకుమార్‌కు అనుభవం ఉన్నది. అతను తన షూటింగ్ స్కిల్స్‌ను కశ్యప్‌కు నేర్పించినట్లు తెలుస్తోంది.