Atul Londhe Patil : రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, చిన్న పిల్లల నుంచి బడా రాజకీయ నాయకుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అతుల్ లోధీ పాటిల్ విమర్శించారు. మహారాష్ట్ర సర్కారు వైఫల్యంవల్లే బాబా సిద్ధిఖీ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. బాబా సిద్ధిఖీ హత్య దురదృష్టకరమని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇది నిదర్శనమని అతుల్ పాటిల్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి ఇంకా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అతుల్ లోధీ పాటిల్ మండిపడ్డారు. కాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై కాల్పులు జరిపి పారిపోయారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధిఖీ హత్య జరగడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
సిద్దిఖీ 1999, 2004, 2009 ఎన్నికల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు లభించింది. ప్రజా సేవ చేయడంతోపాటు గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తారనే పేరు సిద్ధిఖీకి ఉంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లో వారి మధ్య విబేధాలు ఉండేవట. ఈ పార్టీలోనే సిద్ధిఖీ ఆ ఇద్దరు స్టార్స్‌ను దగ్గరకు చేర్చి గొడవలకు పుల్‌స్టాప్ పెట్టించారట.