తిరువనంతపురం, ఆగస్టు 22 : ఎన్నికలలో తాము గెలవాలనుకున్న స్థానాలలో ఓటర్ల జాబితాలో ఓటర్లను కలుపుతామని కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు బీ గోపాలకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పుడు చిరునామాలలో ఓటర్ల పేర్లు చేర్చినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము గెలవడానికి అవకాశం ఉన్నట్లు భావిస్తున్న స్థానాలలోనే ఓటర్ల జాబితాలో ఓటర్లను కలుపుతామని శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్ గోపీ గెలుపు కోసం త్రిసూర్ లోక్సభ స్థానంలోని ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓటర్లను చేర్చినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓటర్ల జాబితాకు భారీ స్థాయిలో ఓటర్లను తాము జతచేస్తామని చెప్పారు.
గెలుపు కోసం జమ్ము కశ్మీరు నుంచి కూడా ఓటర్లను తెచ్చి ఇక్కడి ఓటర్ల జాబితాలో కలుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఓ ఏడాదిపాటు వారిని నియోజకవర్గంలోనే ఉంచి వారి పేర్లను ఓటర్ల జాబితాలో కలుపుతామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను గెలుపొందాలని కోరుకున్న కశ్మీరీ ఓటరు ఇక్కడకు వచ్చి పార్టీ కోసం పనిచేసి ఏడాది పాటు నియోజకవర్గంలోనే ఉంటే తప్పేమిటని ఆయన ఎదురు ప్రశ్నించారు.