న్యూఢిల్లీ, జూన్ 26: భారతదేశ సామాజిక రంగ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రస్తుతం దాదాపు 90 శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వాటాలో పెద్దగా మార్పు లేనప్పటికీ కేంద్రం వాటా మాత్రం గణనీయంగా తగ్గిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన ఒక అధ్యయనం పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా 2008-09లో 33.6 శాతం ఉండగా 2024-25లో అది 8.5 శాతానికి పడిపోయిందని అధ్యయన నివేదిక తెలిపింది. సామాజిక రంగంపై జరిగే మొత్తం వ్యయంలో కేంద్రం వాటా 2009లో గరిష్ఠంగా సుమారు 25 శాతంగా ఉండగా, గత దశాబ్ద కాలంలో అది 10-14 శాతానికి తగ్గిందని అధ్యయనం పేర్కొంది. అంతే కాకుండా కేంద్రం మొత్తం వ్యయంలో సామాజిక రంగ వ్యయం వాటా 2010 దశకం ప్రారంభంలో సుమారు 22 శాతంగా ఉండగా 2022 నుండి అది 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
అధ్యయనం కోసం యూనివర్సిటీ ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీనరేగా), ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి ప్రధాన పథకాలకు కేటాయింపులు, వ్యయ విధానాలను విశ్లేషించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల పునర్వ్యస్థీకరణ, జీఎస్టీ అమలు తర్వాత ఆదాయ పంపిణీ విధానంలో మార్పుల కోసం కేంద్రం అందించే వాటా తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పథకాల అమలు బాధ్యత క్రమంగా రాష్ర్టాలపై పడుతున్నదని అధ్యయనం తెలిపింది.
అనేక పథకాలకు సంబంధించి వ్యయ పంపిణీ విధానాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఉన్న పూర్తి కేంద్ర నిధుల సమకూర్పు లేదా 75:25 నిష్పత్తిలో కేంద్ర-రాష్ర్టాల వాటా విధానం స్థానం లో 60:40 నిష్పత్తి విధానం అమల్లోకి వచ్చింది. కేంద్రం 100 శాతం వేతన వ్యయా న్ని భరించే ఎంజీనరేగా స్థానంలో రాష్ర్టాలు 40 శాతం వేతన వ్యయాన్ని భరించాల్సి ఉండే వీబీ-జీరామ్-జీను తీసుకువచ్చారు.