శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 15:35:43

అజాన్ ఇస్లాంలో భాగమే, లౌడ్ స్పీకర్లు కాదు

అజాన్ ఇస్లాంలో భాగమే, లౌడ్ స్పీకర్లు కాదు

అలహాబాద్: మసీదుల్లోకి ప్రార్థనలకు రావాల్సిందిగా పిలుస్తూ అజాన్ చేయడం ఇస్లాం మతంలో భాగమేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే అందుకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు శశికాంత్ గుప్తా, అజిత్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. 'అజాన్ ఇస్లాంలో విడదీయరాని భాగం కావచ్చు. కానీ అజాన్ చదివేందుకు లౌడ్ స్పీకర్ లేదా శబ్దాన్ని పెంచే మరే ఇతర పరికరాన్ని వాడడం మతంలో భాగం కాదు' అని స్పష్టం చేసింది. మాజీ కేంద్ర న్యాయశాఖమంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తదితురుల దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారించిన అనంతరం ఈ మేరకు తీర్పు చెప్పింది. మసీదులో ఉండే మినార్ పైకి ఎక్కి ముయెజ్జిన్ మానవ స్వరంతో ఎలాంటి యాంప్లిఫయర్ లేకుండా అజాన్ చదవొచ్చు. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం దీనికి ఎలాంటి అడ్డంకులను కల్పించవద్దని కోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 25వ అధికరణంలో పొందుపరచిన మతస్వేచ్ఛ హక్కు కూడా అదే రాజ్యాంగంలోని మూడవ భాగంలో తెలిపిన శాంతిభద్రతలు, నైతికత, ఆరోగ్యం వంటి పరిమితులకు లోబడి ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది. యాంప్లిఫయర్‌కు సంబంధించి పిటిషనర్లు ప్రస్తావించడం గానీ, స్థానిక అధికారుల అనుమతి పొందినట్టు గానీ ఎక్కడా చూపలేదని పేర్కొన్నది. అనుమతి లేకుండా స్పీకర్లు ఉపయోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా లౌడ్ స్పీకర్ కొరకు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు శబ్దస్థాయితో సహా అన్ని అంశాలను చట్ట పరిధిలో పరిశీలించవచ్చని తెలిపింది. యూపీలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు ఈ తీర్పు ప్రతిని పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది.


logo