రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్(Azam Khan)కు బెయిల్ మంజూరీ చేసింది అలహాబాద్ హైకోర్టు. రాంపూర్‌లోని దుంగార్పూర్ కాలనీవాసులను బలవంతంగా తరలించిన కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జస్టిస్ సమీర్ జైన్ ఆయనకు బెయిల్ అప్రూవ్ చేశారు. రాంపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు.. ఆ కేసులో ఆజమ్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆజమ్ఖాన్తో పాటు కాంట్రాక్టర్ బర్కత్ అలీ దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో కాంట్రాక్టర్ బర్కత్ అలీ ఏడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. గత ఏడాది మే 30వ తేదీన ఆజమ్‌ఖాన్‌కు శిక్ష ఖరారైంది. ఎంపీ,ఎమ్మెల్యే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు.
2019 ఆగస్టులో అబ్రార్ అనే వ్యక్తి ఆజమ్‌ఖాన్‌పై కేసు పెట్టారు. రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. 2016 డిసెంబర్లో జరిగిన ఇండ్ల కూల్చివేత ఘటన సమయంలో తనపై ఆజమ్‌తో పాటు పోలీసు ఆఫీసర్ అలీ హసన్ ఖాన్, బర్కత్ అలీ దాడికి పాల్పడినట్లు అబ్రార్ ఆరోపించారు. దీంతో పాటు దుంగార్పూర్ కాలనీ వాసులు ఆజమ్‌ఖాన్‌పై 12 వేర్వేరు కేసుల్ని నమోదు చేశారు. ఆజమ్‌ఖాన్‌కు బెయిల్ మంజూరీ చేసినా.. ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఎందుకంటే ఇదే ఘటనకు చెందిన మరికొన్ని కేసుల్లో ఆయన బెయిల్ పెండింగ్‌లో ఉన్నది.