Ayodhya | అయోధ్య రామజన్మభూమి వద్ద బైక్‌పై అనుమానాస్పదంగా తిరిగుతున్న వ్యక్తిని భద్రతా బలగాలు పదో నంబర్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నాయి. సదరు వ్యక్తిని రామజన్మభూమి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అరెస్టయిన వ్యక్తి హెల్మెట్‌కు కెమెరా ఉండడం అనుమానాలకు తావిచ్చింది. అయితే విచారణలో ఓ కంపెనీకి చెందిన ఉద్యోగిగా గుర్తించారు. సర్వే పనులు చేస్తున్నట్లుగా తేలింది. అయితే, దీనికి సంబంధించి కంపెనీకి అనుమతి ఇవ్వలేదు. సదరు వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భానుపటేల్గా గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో బైక్‌పై తిరుగుతూ అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పదో నెంబర్ గేట్ వద్ద అన్ని భద్రతా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
స్టేషన్లో సీనియర్ పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతన్ని విచారించగా.. మ్యాప్ ఇన్ ఇండియా ఉద్యోగిగా తేలిందని అయోధ్య ఎస్పీ గౌతమ్ తెలిపారు. సర్వే చేసేందుకు ఆ సంస్థ జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసినా అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు రాక ముందు సర్వే చేస్తున్నాడు. అధికారులు సైతం సదరు కంపెనీ ఉద్యోగిగా గుర్తించారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డుల చిరునామా సేకరించారు. ప్రస్తుతం ఇంకా అతన్ని అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది.