Airport | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 25న ప్రారంభంకానున్నది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్న విషయం తెలిసిందే.
వేడుకలకు ముందే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పనులు సిద్ధం కావడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, వీకే సింగ్ విమానాశ్రయాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ 15లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాశ్రయం పనులను మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించారు.
తొలి దశలో 220 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడెల్పుతో రన్ వేను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో దీన్ని 3750 మీటర్లకు విస్తరించే అవకాశం ఉన్నది. ఈ విమానాశ్రయంలో పొగమంచు, రాత్రిపూట ల్యాండింగ్ చేసేలా క్యాట్-1, రెసా పనులను పూర్తి చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సిద్ధమైంది. అయోధ్య ధామ్ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ ఏ320 తదితర విమానాలను సైతం ల్యాండింగ్ చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.