Ayodhya Deepotsav | దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి. దీపోత్సవంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతిక శోభను సంతరించుకున్నది. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. రామ్లాలీతో పాటు పలు ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత జన్మస్థలమైన అయోధ్యలోని ఆలయంలో రామయ్య మళ్లీ దర్శనం ఇచ్చారు.
ఆలయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన దీపావళి వేడుకలు జరుగుతుండడం.. భక్తులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని సరయూ నది వెంట ఉన్న 55 ఘాట్లలో 25లక్షల దీపాలను వెలిగించగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. దీపోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకున్నారు. రామ్‌లల్లాకు ఘన స్వాగతం పలికేందుకు అయోధ్య నగరాన్ని వివిధ రకాల లైట్లు, చిత్రాలు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. దీపోత్సవం కార్యక్రమానికి ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. అయోద్యలో ఉన్న వైభవం కాశీ, మధురలోనూ ఉండాలన్నారు. దేశంలోని ప్రతి ఆధ్యాత్మిక నగరంలోనూ పండుగ వాతావరణం ఉండాలన్నారు. భాష, కులం, మతం పేరుతో తాము వివక్ష చూపడం లేదన్నారు. రాముడు సింహాసనం అధిష్టించిన తర్వాత ఏం జరిగిందో తాము అదే చేస్తున్నామన్నారు. నేడు శ్రేష్ఠ భారత్ సైతం అదే బాటలో పుట్టిందన్నారు.