Ayodhya | దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు నడిచే విమానాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 6 నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను నడుపనున్నాయి. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో విమానాల రాకపోకలు మొదలయ్యాయి. జనవరి 6 నుంచి ఎయిర్పోర్ట్ విమానాలతో నిండిపోనుంది. దేశంలోని నలుమూలల నుంచి టెంపుల్ సిటీలో ల్యాండ్ కానున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనవరి 17 నుంచి అయోధ్యకు సర్వీసులను ప్రారంభించనున్నది. బెంగళూరు నుంచి అయోధ్యకు ఉదయం 8.05 గంటలకు బయలుదేరి.. 10.35 గంటలకు చేరుతుంది. అయోధ్య నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి బెంగళూరుకు సాయంత్రం 6.10 గంటలకు చేరుతుంది.
విమానం వారంలో మూడురోజులు షెడ్యూల్ చేశారు. ఉదయం 11.05 గంటల నుంచి అయోధ్య నుంచి బయలుదేరి 12.50 గంటలకు విమానం కోల్కతా చేరుకుంటుంది. తిరిగి కోల్కతా నుంచి మధ్యాహ్నం 01.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. ఇండిగో జనవరి 15న ముంబయి నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ముంబయి నుంచి అయోధ్య వెళ్లే విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.15 గంటలకు అయోధ్యలో బయలుదేరి ఉదయం 5.40 గంటలకు ముంబయి చేరుకుంటుంది. ఇండిగో విమానం జనవరి 6 నుంచి ఢిల్లీ, అయోధ్య మధ్య సాధారణ విమానాలను ప్రారంభించనుంది. జనవరి 11న అహ్మదాబాద్-అయోధ్య మధ్య వారానికి మూడురోజులు విమానాలను షెడ్యూల్ చేసింది.