Shubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పరిశోధనల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతరిక్షంలో జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాలపై ఉత్సాహంతో ఉన్నారు. భారతదేశం చేపడుతున్న ప్రయోగాలపై ఆయన ప్రత్యేక ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆక్సియం స్పేస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లూసీ లోవ్ బుధవారం ఆక్సియం-4 మిషన్‌లోని సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా తాను చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాల గురించి సమాచారం అందించారు. తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నామని.. అంతరిక్ష కేంద్రంలో చాలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల ఇస్రో సహకారంతో పనిచేస్తోందని.. ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నానన్నారు.
ఇదిలా ఉండగా.. భారత్ త్వరలో గగన్‌యాన్ మిషన్ చేపట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు శుక్లా సేకరిస్తున్నారు. ఇస్రో చైర్మన్ వీ నారాయణ్‌తో ఐఎస్ఎస్ నుంచి మాట్లాడారు. యాక్సియమ్-4 భాగంగా ఐఎస్ఎస్లో ఉన్న శుక్లా ఇస్రో చైర్మన్‌కు ఫోన్ చేసి తన ఆరోగ్యం, మిషన్ పురోగతి, ప్రయోగాల గురించి వివరించారు. మిషన్ పూర్తయ్యాక సవివరమైన డాక్యుమెంటేషన్ అందించాల్సిన ఆవశ్యకతను నారాయణ్ నొక్కి చెప్పారు. ఈ మిషన్ నుంచి లభించే పరిశోధనలు, ఫలితాలు భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష యాత్రకు కీలకం కానున్నాయని తెలిపారు. తాను ఐఎస్ఎస్లో నిర్వహిస్తున్న శాస్త్రీయ అధ్యయనాల లక్ష్యాలు, ఎదురవుతున్న సవాళ్లపై ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాన్షు అప్డేట్స్ ఇచ్చారు. ఈ మిషన్‌కు ఇస్రో మద్దతు ఉంటుందని నారాయణ్ ఈ సందర్భంగా తెలిపారు.