Automatic Signalling : దేశంలో నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న భారత రైల్వే (Indian Railways) ఇప్పటికీ చాలాచోట్ల పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థ (Signalling System) ను అమలు చేస్తోంది. పాత సిగ్నలింగ్ ప్రకారం ఒక ట్రాక్‌పై రైలు ఒక స్టేషన్ నుంచి బయలుదేరి ఆ తర్వాత స్టేషన్‌ను దాటేవరకు ఆ మార్గంలో మరో రైలును అనుమతించరు. దాంతో రైళ్లరాకపోకలు బాగా ఆలస్యమై ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు.
ఈ విధంగా రైలు ప్రయాణాల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించడానికి రైల్వేశాఖ సరికొత్త ఆటోమాటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేబోతోంది. ఈ విషయాన్ని రైల్వే అధికారి నవీన్ కుమార్ వెల్లడించారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలో ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు క్రమం తప్పకుండా సిగ్నల్స్ చేరుతాయన్నారు. అందువల్ల ఒక రైలు సిగ్నల్‌ను దాటగానే మరో రైలు సిగ్నల్‌ను అందుకొని ట్రాక్‌పైకి వస్తుందని చెప్పారు.
గతంలో మొదటి రైలు బ్లాక్ సెక్షన్‌ను దాటే వరకు మరొక రైలును అనుమతించే అవకాశం ఉండేది కాదని నవీన్ కుమార్ అన్నారు. కొత్త సిగ్నలింగ్ వ్యవవస్థతో తక్కువ సమయంలో ప్రయాణికులకు ఎక్కువ రైళ్లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థవల్ల రైలు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల ప్రయోగపూర్వకంగా తూర్పు కోస్ట్ రైల్వే.. తాల్చేర్-పారదీప్ ఫ్రైట్ కారిడార్‌లోని కటక్-పారదీప్ ప్రాంతాల మధ్య ఈ అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది.
ఈ ఆటోమాటిక్ సిగ్నలింగ్ వ్యవస్థవల్ల రైల్వే సేవల కోసం మానవులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా ప్రయాణికుల భద్రత, రైలు ప్రమాదాల తగ్గుదల, రైళ్లు ఆలస్యం కాకుండా సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం వంటి లాభాలు ఉంటాయని నవీన్ కుమార్ తెలిపారు. వాణిజ్యానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు త్వరితగతిన జరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి సైతం మెరుగవుతుందని అన్నారు.