న్యూఢిల్లీ: భారత్ సహా విదేశాలకు చెందిన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా గ్రాడ్యుయేట్ వీసా ప్రోగ్రామ్ నిబంధనల్లో ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. విదేశీ విద్యార్థుల పని గంటలపై పరిమితిని ఎత్తివేసింది. ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థులు ఏ ఇండస్ట్రీలో అయినా తమ ఇష్ట ప్రకారం ఎన్ని గంటలైనా అపరిమితంగా పని చేసుకోవచ్చు. విద్యార్థుల గరిష్ఠ వయో పరిమితిని 35 ఏండ్లుగా నిర్ణయించారు.
ఆస్ట్రేలియాలో గుర్తింపు పొందిన కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఇతర దేశాల విద్యార్థులు తాతాల్కిక గ్రాడ్యుయేట్ వీసాకు అర్హులు అవుతారు. దీంతో ఆస్ట్రేలియాలో ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా విద్యార్థులు తమ కుటుంబాలను ఆస్ట్రేలియాకు తీసుకొని పోయే అవకాశంతో పాటుగా అక్కడ అపరిమిత గంటలు ఉద్యోగం చేసుకొనే అవకాశం వస్తుంది.