Attari Border | పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులు 48గంటల్లో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచే పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్దుకు చేరుకోవడం మొదలుపెట్టారు. వారి పత్రాలను తనిఖీ చేసిన తర్వాత.. బీఎస్ఎఫ్ అధికారులు వారిని సరిహద్దు దాటేందుకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 8 గంటల నుంచి 104 మంది పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో 29 మంది భారతీయులు పాక్ నుంచి దేశానికి వచ్చారు. ప్రతి రోజు మాదిరిగానే బీఎస్ఎఫ్ వాఘా సరిహద్దులో రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఆ సమయంలో గేట్లను మూసివేసింది. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను అధికారులు వెనక్కి పంపించి వేశారు. కానీ, కొద్దిసేపటికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా ప్రతిరోజూ 25 వేలకు పైగా పర్యాటకులు బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు వస్తుంటారు. కానీ, గురువారం ఈ సంఖ్య మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే ఉంది.
ఇదిలా ఉండగా.. అట్టారి సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌కు తిరిగి వచ్చిన మహమూద్ అహ్మద్ కొద్దిరోజుల కిందట తన బంధువులను కలుసుకునేందుకు భారత్‌కు వచ్చినట్లు తెలిపాడు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని.. ఇరువైపులా ప్రజలు ఒకరినొకరు కలుసుకునేలా పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించాడు. మరో వైపు కాన్పూర్ నుంచి వచ్చిన సీమా అనే మహిళ అట్టారి సరిహద్దుకు రాగా.. ఆమెను పాక్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. తన సోదరి చందా అఫ్తాబ్ కరాచీలో ఉందని.. ఆరోగ్యంతో బాధపడుతుందని కన్నీటి పర్యంతమైంది. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి వీసా వచ్చిందని.. తనను ఇప్పుడు కరాచీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని వాపోయింది. ఉగ్రవాదుల చర్య కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది. మరో వైపు ప్రభుత్వం ఐపీసీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్యం చేస్తూ వస్తుండగా.. ట్రక్కులు పాక్ నుంచి వస్తుంటాయి. ప్రస్తుతం ఐపీసీకి చేరిన ట్రక్కులకు అనుమతి ఇవ్వగా.. రాబోయే రోజుల్లో మొత్తం మూతపడే అవకాశం ఉన్నది. దీని కారణంగా స్థానిక వ్యాపారులు భారీ నష్టపోయే అవకాశం ఉండనున్నది. ఇప్పుడు వ్యాపారులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేరే మార్గం ద్వారా వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉండనున్నది. దాంతో ధరలు పెరిగేందుకు ఛాన్స్ ఉంటుంది.