పాట్నా, నవంబర్ 6: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు గురువారం ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై లఖిసరాయ్‌లో గ్రామస్తులు రాళ్లు, పేడ, చెప్పులు విసిరి తమ నిరసన తెలియచేశారు. గుంతలు నిండిన రోడ్లు, దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న పౌర సమస్యలపై విసిగిపోయిన ప్రజలు తమ ఆగ్రహాన్ని నిరసన రూపంలో తెలియచేసినట్లు పోలీసు వర్గాలు, స్థానిక వార్తలు సూచిస్తున్నాయి.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగవసారి లఖిసరాయ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు సిన్హా ఖోర్జారీ గ్రామనికి రాగా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌ని స్థానికులు చుట్టుముట్టారు. వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. తనపై దాడి చేసిన నిరసనకారులు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)కు చెందిన గూండాలని సిన్హా ఆరోపించారు. బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తోందని, ఆర్జేడీ గూండాల గుండెలపై బుల్డోజర్లు ఎక్కిస్తామని హెచ్చరించారు. అయితే పోలీసులు మాత్రం ఈ సంఘటనకు రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు తమ సమస్యను నేరుగా సిన్హా దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని జిల్లా డీఐజీ రాకేష్ కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.