బెర్హంపూర్: పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు దళితులపై దాడిచేసి, గుండుకొట్టి, మోకాళ్లపై నడిపించి బలవంతంగా గడ్డి తినిపించడమే కాకుండా వారితో మురికినీరు తాగించారు. బీజేపీ పాలిత ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం జరిగిందీ అమానుష ఘటన. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. సింగిపూర్‌కు చెందిన బాధితులు బాబులా నాయక్ (54), బాలు నాయక్ (42) కలిసి రెండు ఆవులు, ఒక దూడను ఆటోలో హరిఔర్ నుంచి తమ గ్రామమైన జహదకు తీసుకెళ్తున్నారు.
తమను తాము గోరక్షకులుగా చెప్పుకొంటున్న కొందరు వ్యక్తులు ఖరిగుమ్మ వద్ద వారిని అడ్డుకున్నారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ రూ. 30 వేలు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో ఈ అమానుష చర్యకు పాల్పడ్డారు. తొలుత వారిని సమీపంలో సెలూన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించారు.
అనంతరం కిలోమీటరు దూరం వరకు మోకాళ్లపై నడిపించారు. అక్కడ గడ్డి తినిపించి, మురికి నీళ్లు తాగించినట్టు పోలీసులు తెలిపారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితులు ధారకోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబులా నాయక్ కుమార్తె వివాహం సందర్భంగా సంప్రదాయబద్ధంగా బహుమతి ఇచ్చేందుకే గోవులను కొనుగోలు చేసినట్టు బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.