కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఈ నెల 26 లేదా 27న ఆమె సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలుసుకున్న కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఈ నెల 26 లేదా 27న ఆమె సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఎల్జీని కలుసుకున్న అనంతరం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎల్జీకి తెలిపామని, ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను తాను పరిరక్షిస్తానని పేర్కొన్నారు. మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. అతిశీ నేతృత్వంలో కొత్త మంత్రివర్గం ప్రమాణం చేసేందుకు తేదీ ఖరారు చేయాల్సిందిగా ఎల్జీని కోరామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాయని ఆతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్ కాకుండా మరొక నాయకుడైతే సీఎం కుర్చీని వదిలిపెట్టేవారు కాదని అన్నారు. కేజ్రీవాల్ ప్రజాకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అందుకే రాజీనామా చేశారని చెప్పారు. ఇది తమకు ఎంతో బాధాకరమైన సమయం అని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలు ప్రతినబూనారని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మహారాష్ట్రతోపాటే నవంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు.
‘ఢిల్లీ సీఎంగా అతిపెద్ద బాధ్యతను తనపై మోపిన ‘గురువు’ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు’ అని ఆప్ నాయకురాలు ఆతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తరువాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా ఆతిశీ నిలవనున్నారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలు (43)గా కూడా ఆతిశీ నిలవనున్నారు. ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడంపై ఆతిశీ స్పందిస్తూ.. ఇది ఒకవైపు తనకు ఆనందాన్ని, మరోవైపు తీవ్ర ఆవేదనన కలిగించే సందర్భమని వ్యాఖ్యానించారు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నేరుగా సీఎం పదవిని పొందడం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యమని అన్నారు. తనపై నమ్మకముంచిన కేజ్రీవాల్ తనను తొలుత ఎమ్మెల్యేను చేశారని, ఆపై మంత్రి పదవినిచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిగిలిన కొద్ది నెలలు.. తాను మళ్లీ ఢిల్లీ సీఎం కుర్చీపై కేజ్రీవాల్‌ను కూర్చోబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు.
సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2013లో ఆప్‌లో చేరిన ఆతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఆతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపారు.