Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అశోక్ విహార్‌లో అత్యధికంగా ఏక్యూఐ 416గా నమోదైంది. ఆ తర్వాత గౌతమ్ పురి వద్ద 415, ఆనంద్ విహార్ వద్ద 366గా గాలి నాణ్యత సూచీ ఉంది. గణేశ్‌పూర్ వద్ద 318, జీటీబీ నగర్లో 302, కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ ప్రాంతంలో 298, యమూర్ విహార్‌లో 287గా ఏక్యూఐ నమోదైంది. ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29°C-31°Cగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 17°C-19°Cగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. రాత్రికి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఢిల్లీ ఆర్ఎమ్సీ అంచనా వేసింది.
తీవ్రమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లోని ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్వాసకోశ, ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో స్థానికులు ఆసుపత్రులకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 29న కృత్రిమ వర్షం
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని (cloud seeding) కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు. ఐఐటీ-కాన్పూర్ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఐఎండీ, ఐఐటీఎమ్-పుణె తోడ్పాటును అందిస్తున్నాయి. దీపావళి తర్వాత పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో అయిదు చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఈ వర్షం కారణంగా రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read..
Indian woman | యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం
Actor Vijay | నేడు కరూర్ బాధితులను కలవనున్న విజయ్.. మీడియా, పార్టీ నేతలకు నో ఎంట్రీ