కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో (Kanpur) దారుణం చోటుచేసుకున్నది. ఓ మందు ధర విషయమై మెడికల్ షాపు నిర్వాహకుడితో జరిగిన గొడవ న్యాయ విద్యార్థి (Law Student) ప్రాణం మీదికి వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అభిజిత్ సింగ్ ఛండేల్ అనే 22 ఏండ్ల యువకుడు కాన్పూర్ యూనివర్సిటీలో లా మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత రాత్రి కాన్పూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాప్‌కు మందుల కోసం వెళ్లాడు. ఈక్రమంలో ఔషధాల ధర విషయంలో దుకాణం నిర్వహాకుడు అమర్ సింగ్‌తో వాగ్వాదం చోటుచేసుకున్నది. అదికాస్తా పెద్దది కావడంతో ఇరువురు పోట్లాడుకున్నారు. అమర్ సింగ్‌కు అతని సోదరుడు విజయ్ సింగ్‌తోపాటు మరో ఇద్దరు ప్రిన్స్ రాజ్ శ్రీవాత్సవ, నిఖిల్ తోడయ్యారు. నలుగురు కలిసి అభిజిత్ తలపై విచక్షణా రహితంగా కొట్టారు. మొహానికి దెబ్బతగలడంతో కింద పడిపోయాడు. దీంతో పదునైన వస్తువుతో అతని కడుపులో పొడిచారు. చేతి వేళ్లు రెండింటిని కోసేశారు.
ఎలాగోలా వారినుంచి తప్పించుకున్న అభిజిత్.. ప్రాణాలను రక్షించుకునేందుకు కేకలు వేస్తూ ఇంటివైపు పరుగెత్తాడు. అతని అరుపులు విన్న స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.