Dr. Jayant Narlikar | పుణె: ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (86) ఇకలేరు. హూయల్-నార్లికర్ గురుత్వాకరణ సిద్ధాంతంతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయన పుణెలో కన్నుమూశారు. ఖగోళ శాస్ర్తానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ నార్లికర్ మంగళవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థలను నెలకొల్పి, భారత వైజ్ఞానిక రంగంలో మహోన్నత వ్యక్తిగా నిలిచిన డాక్టర్ నార్లికర్ ఇటీవల పుణెలోని ఓ హాస్పిటల్లో తుంటెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. డాక్టర్ నార్లికర్ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి.
ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. 1938 జూలై 19న జన్మించిన డాక్టర్ నార్లికర్ బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) క్యాంపస్‌లో తొలి దశ విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి విష్ణు వాసుదేవ నార్లికర్ అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, గణితశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు. ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌కి వెళ్లిన డాక్టర్ నార్లికర్.. మ్యాథమెటికల్ ట్రిపోస్లో వ్రాంగ్లర్ అండ్ టైసన్ పతక విజేతగా నిలిచారు. బ్రిటన్‌లో ఉన్నప్పుడే తన డాక్టోరల్ అడ్వైజర్ ఫ్రెడ్ హూయల్తోపాటు ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి ప్రఖ్యాత హూయల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించిన డాక్టర్ నార్లికర్.. 1972లో భారత్‌కు తిరిగొచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్‌లో చేరారు.