గాంధీనగర్, డిసెంబర్ 2: భారత్ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్‌యాన్ యాత్రకు వ్యోమగాముల ఎంపిక పూర్తయ్యిందని, 2025లో చేపట్టే అంతరిక్ష యాత్ర కోసం తామంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ప్రకటించారు. పండిత్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి, సురక్షితంగా వారిని భూమిపైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యమని చెప్పారు. ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతం తర్వాత తదుపరి మిషన్ అయిన గగన్‌యాన్ కోసం సిబ్బంది రేయింబవళ్లు చేసిన కృషితో ఈ మిషన్ సిద్ధమైందని చెప్పారు. ఈ మిషన్‌లో వ్యోమగాములను తిరిగి సురక్షితంగా భూమిపై ల్యాండయ్యేలా చేయడం చాలా ముఖ్యమని అన్నారు. అంతరిక్ష మిషన్లకు సంబంధించి పలు సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేశామని, పలు టెక్నాలజీల మేలు కలయికతోనే ఇలాంటి క్లిష్టతర మిషన్లను విజయవంతం చేయగలిగామన్నారు.