న్యూఢిల్లీ, జూలై 12: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వైమానిక దళం సంయుక్తంగా..పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘అస్త్ర’ క్షిపణి పరీక్షలు విజయవంతం అయ్యాయి. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని చేధించగల ‘అస్త్ర’ను శుక్రవారం సుఖోయ్-ఎంకేఐ యుద్ధ విమానంతో ఒడిశా తీరంలో ప్రయోగించారు. అత్యంత అధునాతన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలున్న ఈ క్షిపణి, 100కిలోమీటర్లకు మించిన లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. పరీక్ష సమయంలో రెండు సార్లు క్షిపణిని ప్రయోగించి, వేర్వేరు పరిధిలో ఉన్న హై స్పీడ్ గగనతల లక్ష్యాలను పేల్చారు. మిస్సైల్ పరీక్ష విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో, వైమానిక దళం అధికారులను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.