సిమ్లా: వరుసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారం ఇవ్వని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఈ సారి ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్, బీజేపీ, ఆప్ త్రిముఖ పోరులో అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ప్రతిసారి కొత్త పార్టీకి అవకాశం ఇస్తున్నట్టు పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తారా? లేక అధికార పార్టీకే పట్టం కట్టి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తారా? అన్న ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు 55 లక్షల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 68 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 412 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోసారి అధికారం చేపట్టి చరిత్ర తిరగరాయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఈ రెండు పార్టీలకు ఆప్ సవాల్ విసురుతున్నది. కచ్చితంగా హిమాచల్ తమదేనని కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. తన సొంత రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రియాంక గాంధీనే నమ్ముకొన్నది. కాగా, శనివారం నాటి పోలింగ్‌కు ఈసీ సర్వం సిద్ధం చేసింది.