లాటూర్: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ బాధితురాలైన ఓ బాలికపై పిల్లల వసతిగృహంలో అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమెకు గర్భస్రావం కూడా జరిగింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గర్భం దాల్చిన ఆ బాలికను గర్భస్రావం చేయించుకోవాలని నిందితులు ఒత్తిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తన సొంత జిల్లా ధారాశివ్లోని ధోకీ పోలీసు స్టేషన్లో బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. 2023 నుంచి 2025 మధ్య హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఆశ్రయం కల్పించే హసేగావ్లోని సేవాలయ్లో తనపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు బాలిక ఫిర్యాదు చేసింది.
గడచిన రెండేండ్లుగా సేవాలయ్లో పనిచేసే ఉద్యోగి ఒకరు తనను నాలుగుసార్లు రేప్ చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను దవాఖానకు తీసుకువెళ్లగా నాలుగు నెలల గర్భవతి అన్న విషయం బయటపడింది. అబార్షన్ చేయించేందుకు నిందితుడు ఓ డాక్టర్ని కూడా ఏర్పాటు చేసినట్లు బాధితురాలు తెలిపింది.