గౌహతి: ట్యూషన్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl gang raped) రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధిత బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికపై సామూహిక లైంగిక దాడి విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం 14 ఏళ్ల బాలిక ట్యూషన్ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నది. మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడ్డుకున్నారు. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కాగా, రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు రక్షించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు బాలికపై సామూహిక అత్యాచారం సంఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సీఎం హిమంత బిస్వా శర్మ ఈ సంఘటనపై స్పందించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని అభివర్ణించారు. నిందితులను వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.