గౌహతి: అస్సాంలోని నగావ్ జిల్లాలో 14 ఏళ్ల అమ్మాయిని ముగ్గురు రేప్ చేశారు. ఆ కేసులో ఇద్దరు పరారీలో ఉండగా, ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అయితే ఆ నిందితుడిని .. పోలీసులు క్రైం సీన్(Crime Scene) వద్దకు తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా క్రైం సీన్‌ను రిక్రియేట్ చేసేందుకు నిందితుడు తఫుజల్ ఇస్లాంను .. ఘటన జరిగిన ప్రాంతానికి పట్టుకెళ్లారు. ఇవాళ ఉదయం 4 గంటలకు క్రైం సీన్ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఆ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ధింగ్ సమీపంలో ఉన్న ఓ చెరువులో అతను దూకాడు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత.. ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలు రెండు గంటల పాటు వెతికిన తర్వాత ఆ నిందితుడి మృతదేహాన్ని పసికట్టారు.
క్రైం సీన్ వద్ద.. చేతులకు ఉన్న బేడీలను.. ఓ పోలీసు కానిస్టేబుల్ నుంచి లాగేసి.. పరుగెత్తినట్లు ఓ అధికారి తెలిపారు. ఆ సమయంలో ఆ నిందితుడు చెరువులో దూకినట్లు చెప్పారు. తమ కానిస్టేబుల్‌కు కూడా గాయాలు అయినట్లు అధికారి చెప్పారు. అతను ఎలా తప్పించుకున్నాడన్న కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మరో నిందితుడి ఇంటికి తఫుజల్ ఇస్లాం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.
కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. గురువారం ముగ్గురు వ్యక్తులు బాలికపై లైంగిక దాడి చేశారు. ఆ అమ్మాయి చెరువు వద్ద అపమారక స్థితిలో కనిపించింది. దాదాపు గంట పాటు అక్కడే పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింస అని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎవర్నీ వదిలేది లేదని, నిందితులను శిక్షిస్తామని ఆయన అన్నారు.