పాట్నా: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చీప్ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్నారని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) విమర్శించారు. ముస్లింలను సాఫ్ట్‌గా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం ఎమ్మెల్యేలకు శుక్రవారం రెండు గంటల నమాజ్ విరామాన్ని రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ రూల్స్ కమిటీ తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారాల్లో ఏ విధమైన వాయిదా లేకుండా అస్సాం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని స్పీకర్ బిస్వజిత్ డైమరీ ప్రతిపాదించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
కాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దీనిపై స్పందించారు. శుక్రవారం పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చౌకబారు ప్రజాదరణ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘ఆయన ఎవరు? ఆయన కేవలం చీప్ పాపులారిటీని కోరుకుంటున్నారు. ముస్లింలను సాఫ్ట్ టార్గెట్‌గా బీజేపీ మార్చుకుంది’ అని మండిపడ్డారు.