గౌహతి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Sarma) మరో కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్థాన్ ఆర్మీతో సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు భారత్ నుంచి కోల్బర్న్ 19 సార్లు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. పాక్‌లో సంచరిస్తున్న సమయంలో ఆ దేశ ఆర్మీ ఆమెకు సహకరించినట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్‌లో కోల్బర్న్ పనిచేశారని, ఆ తర్వాత ఆమె ఢిల్లీలోని ఎన్జీవోలో చేసినట్లు చెప్పారు. కానీ పాకిస్థాన్ నుంచి ఆమె రెగ్యులర్‌గా శాలరీ తీసుకున్నట్లు తెలిపారు.
ఎంపీ గౌరవ్ గగోయ్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లినట్లు బిశ్వశర్మ తెలిపారు. వారం రోజుల్లో ఆయన భార్య ఇండియాకు తిరిగి వచ్చిందని, కానీ గగోయ్ మాత్రం అక్కడే మరో ఏడు రోజులు ఉన్నట్లు చెప్పారు. పాకిస్తాన్లో 15 రోజుల పాటు గగోయ్ ఏం చేశారో చెప్పాలని అస్సాం సీఎం ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో అతనేం చేశారో చెప్పాలని, వాళ్ల ఆర్మీకి ఎలా ఆయన సహకరించారో వెల్లడించాలన్నారు. ఒకవేళ అధికార హోదాలు గగోయ్ పాకిస్థాన్‌కు వెళ్తే దాన్ని ప్రశ్నించే వాళ్లం కాదు అని, కానీ ఆయన తన పర్సనల్ పనిమీద వెళ్లారని, అక్కడ పాక్‌లో ఎవరితో ఆయన ఉన్నారో తెలియాలని బిశ్వ శర్మ చెప్పారు.